Description
ఇవి గడ్డిపరకల కథలు.
గడ్డి పరకలు చిన్నవే. కానీ తుపానులను కూడా తట్టుకుంటాయి. తుఫానులో పెను వృక్షాలు కూలిపోయినా గడ్డిపరకలు నిటారుగానే నిలుచుంటాయి.
అవసరమైతే గడ్డిపరకలు ఛురకత్తులౌతాయి.
దేవదేవుని విశ్వరూప సందర్శనం జరిగాక ఇక ఉగ్రవాది తూటా అంటే భయమెందుకు అన్న కృష్ణ కుమార్ గోయంకా…
తీవ్రవాది తూటాను హేళన చేసిన హేమంత గొగోయ్,,,
తుపాకీని ఎదిరించి మరీ నిలబడిన శశిధరన్….
మృత్యువును కౌగిలించుకోవడానికి లేశ మాత్రం కూడా వెరబని ప్రమోద్ దీక్షిత్, మురళీ మనోహర్, ఓం ప్రకాశ్ చతుర్వేదీలు….
మువ్వన్నెల జెండా రెపరెప కోసం ప్రాణాలిచ్చేందుకు జంకని వృద్ధుడు,…..
ఆరెస్సెస్ గణవేశ్ ను వేసుకున్న లెనిన్…..
వీళ్లంతా సామాన్యులు…కానీ అసామాన్యులు….
వీళ్ల బతుకులు సాధారణం…. కానీ జీవనం అసాధారణం….
అలాంటి అసాధారణ, అసామాన్యుల కథలే అస్సాం కథలు.
1990వ దశకంలో ఉగ్రవాదం తీవరించిన వేళ, ఛాతీ ఎదురొడ్డిన వీరవరుల కథలు ఇవి.
చదవండి… చదివించండి.
ISBN : 978-81-983858-0-2 ; Publisher : Samvit Prakashan ; Paperback



Subramanyam – :
చిన్నప్పటినుండి ఈశాన్య భారత చరిత్ర పైన కుతూహలము నాకు ఉన్నది. అందులో అస్సాం అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది, భారత దేశంలో ముఘలులు పరిపాలించ లేక పోయిన ప్రాంతాలలో అస్సాం ఒకటి. అందుకు వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఒక పిచ్చి ఉండేది. చిన్నాప్పుడు లచిత్ బర్ఫుకన్, అతని వీరగాథలు, సారైఘాట్ యుద్ధం గురించి చదివాను. ఆ తర్వాతి కాలంలో అస్సాంలో జరిగిన పరిణామాలు, చైనా దాడులు తేజ్పూర్ వరకు సైన్యాలు రావడం, ఉగ్రవాద ఉద్యమాలు, అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, ఇవన్నీ నాకు ఎప్పుడూ ఆసక్తిని కలిగించేవి.
అయితే “అస్సాం గాథలు” అనే పుస్తకం చదివిన తరువాత నా దృష్టికోణమే మారిపోయింది.
ఈ పుస్తకం చదివే వరకు, 2016లో అస్సాంలో బీజేపీ అధికారంలోకి రావడం వెనుక ప్రధానంగా కుల
సమీకరణలు, 15 ఏళ్ళ కాంగ్రెస్ పాలన పైన వ్యతిరేకత మరియు రాజకీయ సమీకరణలే కారణమని అనుకున్నాను. ఈ పుస్తకం ద్వారా ఆ మార్పు ఒక్కరోజులో జరిగినది కాదు, అది దశాబ్దాల పాటు నిశ్శబ్దంగా సాగిన పోరాటాల ఫలితం, అనేక మంది తమ జీవితాలను త్యాగం చేస్తూ, పేరు గానీ కీర్తి గానీ ఆశించకుండా చేసిన సేవల ఫలితం అని తెలుసుకున్నాను.
ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది రచయిత ఈ కథలను చెప్పే విధానమే. ఇది మహానాయకుల గాథ కాదు. పెద్ద పెద్ద పేర్లు, గొప్ప పదవులు ఉన్నవారి కథ కాదు. ఇది సామాన్య కార్యకర్తల జీవితం. అటవీ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో పనిచేసిన సాధారణ వ్యక్తుల గాధ. వారు వెలుగులోకి రాలేదు, కానీ వారు చేసిన పనులు, వారి త్యాగాలు అమోఘమైనవి.
తమవద్ద ఏమీ లేకపోయినా దేశం కోసం అంకితభావంతో పనిచేసిన సాధారణ కార్యకర్తలు ఎదుర్కున్న అసాధారణ పరిస్థితులు ,దానికి వారు ప్రతిస్పందిణిన విధానమే ఈ గాథ.
కృష్ణ కుమార్ గోయెంకా అనే వ్యాపారి కథతో ఈ గాథలు ప్రారంభమవుతాయి. చంపేస్తామంటున్న ఉగ్రవాదులు ఒకవైపు, తాను నమ్మిన సిద్ధాతం మరొకవైపు, అభం -శుభం తెలియని తన కుటుంబం మరొక వైపు. భగవద్గీతను నిత్యం చదివే గోయెంకా గారు ఏమి చేశారు, ప్రాణభయం తో వణికిన ఆ మనిషి స్ఫూర్తి ప్రదాత ఎల అయ్యరు ? వారి కథను చదవవలసిందే.
అలాగే జోరంథాంగ అనే యువకుడి కథ మనసును తాకుతుంది. గీతని ప్రేమించిన మనిషి , ఆ ప్రేమ కోసం ఏం చేసాడు , ఎంత దూరం వెళ్ళాడు, అతని లో వచ్చిన మార్పు ఏమిటి , ఈ కథ లో అసలు సంఘ్ పాత్ర ఏమిటి , ఖచ్చితం గా చదవవలసిందే .
హేమంత్ గోగోయి , కాలేజీ మెట్లను సైతం చూడని ఈ మనిషి ఒక శక్తి గా ఎలా మారాడు? విద్యాభ్యాసం పెద్దగా లేకపోయినా ఉగ్రవాదులను ఎదిరించాలి, దేశం ముక్కలవకుండా చూడాలి, అన్న స్ఫూర్తి ఆయనకు ఎలా వచ్చింది ? , అసాధారణమైన ధైర్యంతో, తన ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసేంత ప్రేరణ ఎలా కలిగింది? గురి పెట్టిన తుపాకి వైపు ఆయన ఎలా పరిగెట్టగలిగాడు ?
ఇంకా ప్రమోద్ దీక్షిత్, ఓం ప్రకాశ్ చతుర్వేది, మురళీ మనోహర్ వంటి అనేక మంది కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. వీళ్ళు అస్సామీయులు కారు, కానీ అస్సాం కోసం తమ ప్రాణాలను వదులుకున్నారు. సంఘం చెప్పిన పనిని చేసుకుంటూ వెళ్ళారు , పతత్వేష్వకాయో నమస్తే నమస్తే అని నవ్వుతూ ఆత్మ బలిదానం చేశారు. వీరంతా వెలుగులోకి రాని వీరులు. కాని ఇటువంటివారి సేవల వల్లే ఈ దేశం నిలబడి ఉంది.
నా వరకు నాకు అన్నిటి కంటే గొప్ప కథ “గావ్ బుడ్ఢా” ది . మన దేశం లో అడుగడుగునా నిండిన సనాతన ధర్మం యొక్క చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం ఆయాన. కళ్ళెదుట ఏ మనిషి తట్టుకోలేనంత విషాదమా,మరొకపక్క కాలిపోయిన ఇల్లా, ఈ సమయం లో కూడా నేను ఎమైనా ఇస్తాను, కానీ దేనినీ దానం గా తీసుకోను అన్న ఆ మహా మనీషి గురించి తలుచుకున్నప్పుడల్ల నా మాట వినకుండా నా కళ్ళు చెమరుస్తాయి.
ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన భావన ఒక్కటే, నేదు దేశం లో మన చూస్తున్న మార్పు కొన్ని వేల మంది సమిధలై ఆహుతవడం వలన వచ్చింది. దీనిని మనం కాపడుకోవాలి, అలాగే ముందు తరాలకు అందించాలి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుండీ దేశం కోసం పని చేసినవారు ఎప్పుడూ ప్రచారం కోరలేదు. వారు పేరు కోసం కాదు, బాధ్యత కోసం జీవించారు.
“అస్సాం గాథలు” ఒక రాజకీయ గ్రంథం కాదు. ఇది ఒక తరం చేసిన త్యాగానికి నివాళి. ఒక చరిత్ర పుస్తకం కాదు, ఒక సాక్ష్యం. ఇది జీవితం చూసిన మనుషుల కథ. మౌనంగా జరిగిన త్యాగాల కథ. చరిత్ర పుస్తకాలలో చోటు దక్కని జీవితాల కథ.
ఈ దేశం కోసం నేను ఏమి చేస్తున్నాను? అన్న ప్రశ్నను మళ్ళీ గుర్తు చేసిన ఈ పుస్తకానికి నమస్సులు. ఈ అద్భుతమైన రచనను అందించిన శ్రీ కస్తూరి రాకా సుధాకర రావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. మరొకమాట లేదు.
VUYYURU SIVANAGAMALLESWARARAO – :
Very great stories brought to ours thanks raka garu